23, డిసెంబర్ 2009, బుధవారం

ఈ శకపు తొలి సామాజిక విప్లవకారుడు జీసస్




జీసస్ జన్మించేనాటికి యూరప్, ఆసియా ఖండాలలో అధికారం చెలాయిస్తున్న రోమన్ సామ్రాజ్యం పతనావస్థలో వుంది. బానిసల మూలుగులను పీల్చి భోగలాలస జీవితాన్ని గడిపే రోమన్ భూస్వాములు; సంతలోని పశువుల్లా కొనివేయబడి గానుగెద్దుల్ల బతుకుతున్న బానిసలు; మూఢమత సమ్మకాల వల్ల నాటి ప్రజల్లో వ్యాపించిన నిరాశా నిస్పృహలు; భరించరాని సామాజిక ఆర్థిక అసమానతలు; ఇవే క్రీస్తు పుట్టుటకు పూర్వమున్న వివిధ సాంఘిక స్థితిగతులు. బానిస సమాజంలో వారికి సర్వహక్కులూ నిరాకరింపబడ్డాయి. ఈ పరిస్థితులు బైబిల్ లోని ఇర్మియా 6 వ అధ్యాయంలోని క్రింది వాక్యాలవల్ల తెలుస్తాయిః
" నా ప్రజలలో దుర్మార్గులున్నారుః వేటగాళ్ళు పొంచివున్నట్లు వారు పొంచి వున్నారు. మానవులను బంధించేందుకు వారు బోనులను పెట్టారు. పంజరం పక్షులతో నిండి వున్నట్లు వారి ఇళ్ళు కపటంతో నిండి వున్నాయి. అంచేతనే వారు అధికులూ, ఐశ్వర్యవంతులూ అయ్యారు. వారు బాగా క్రొవ్వి మదించి వున్నారు. విపరీతమగు దుర్మార్గకృత్యాలు చేస్తున్నారు. ఈ పనులను చూచి వారిని నేను శిక్షించకుండా వుందునా?" (ఇర్మియా 6వ అధ్యాయం - 26, 27, 28,29).
"గుండెలు బ్రద్దలై బాధపడేవారిని దృఢపరచుటకూ, కారాగారాల్లో వున్నవారిని విడుదల చేయుటకు, బానిసలకు విముక్తి ప్రసాదించుటకు, దుఃఖంతో కుమిలిపోయేవారినందరినీ ఓదార్చుటకూ, సీయోనులో దుఃఖించి బాధితులకు ఆనంద వస్త్రములిచ్చుటకూ, బూడిదకు బదులు పూలదండనూ, దుఃఖానికి బదులు సుఖాన్నీ వారికి ప్రసాదించేందుకు యెహోవా నన్ను పంపియున్నాడు." (యెషయా-62వ అధ్యాయం- 1,2,3.)

బైబిల్ లోని పాత నిబంధన యందలి ఈ వాక్యాలు నాటి రోమన్ భూస్వాముల నిరంకుశ పరిపాలనను, నాటి ప్రజల స్థితిగతులను తెలియజేస్తాయి. క్రీ.పూ.23 నుండి 20 వరకూ జరిగిన జరిగిన చారిత్రక ప్రసిద్ధమైన స్పార్టకస్ తిరుగుబాటులో బానిసలంతా ఏకమైన్ రోమన్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసారు. కానీ ఇది అత్యంత పాశవికంగా అణచివేయబడడంతో నిస్పృహకు గురైన ప్రజలు దేవుడె మరల జన్మించి వారిని కాపాడుతారని ఎదురు చూశారు.

అలాంటి అస్తవ్యస్త పరిస్తితుల సమాజంలో పాలస్తీనా దేశంలోని నాజరత్ గ్రామంలో అతిపేద వడ్రంగి కుటుంబంలో, జోసఫ్, మేరీలకు పశువుల కొట్టంలో జీసస్ జన్మించాడు. అతి చిన్నవయసులోనే దేశం నలుమూలలా సంచారం చేసాడు. ఆజన్మ బ్రహ్మచారిగా నిశుద్ధ జీవితాన్ని గడిపాడు. నాటి సమాజంలోని రాజకీయ ఆర్థిక మత నైతిక పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు.

హృదయవిదారకమయిన బానిసల స్థితిగతులను చూసి ద్రవించిపోయాడు. అంచేతనే బానిస విధానాన్ని అత్యంత నిశితంగా విమర్శించి, బానిసలూ, పేదలూ మానవులేనని, బానిసత్వం రూపుమాసిపోవాలని మేఘగంభీర నిస్వనంతో ప్రభోదించాడు. విధిగా కొన్ని నైతిక సూత్రాలను ప్రతివ్యక్తి అనుసరించినపుడే జీవితంలో శాంతి సౌఖ్యాలు అనుభవించడానికి సాధ్యపడుతుందని ప్రచారంచేసాడు. అంచేతనే మానవత తొణికిసలాడే విధంగా నాటి ప్రజలకి ప్రభోదించాడు.
" బీదలు దేశంలో వుండకమానరు. కాబట్టి నేను నీ దేశంలో వున్న సహోదరులగు దీనులకు అవశ్యం నువ్వు సహాయం చేయవలెనని నిన్ను ఆజ్నాపిస్తున్నాను."(ద్వితీయ ఉపదేశ కాండ - 15వ అధ్యాయం -7-9-11.)
" నీ ఆహారము ఆకలిగొన్నవారికి పెట్టుట, మీ ఆత్మబంధువుకు ముఖం తప్పించకుండా వుండుట, దిక్కుమాలిన బీదలను నీ ఇంటిలో చేర్చుకొనుట, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుట, ఇదేకదా నాకు ఇష్టమైన ఉపవాసం." (యెషయా-58వ అధ్యాయం),
' నీ వలెనే నీ పొరుగువాణ్ణి ప్రేమించుమనీ' 'తాను చూచునట్టి తన సహోదరుని ప్రేమించనివాడు, తాను చూడని దేవుని ప్రేమించలేడ'నీ తనకున్న దానిలోనే తన యిరుగుపొరుగు వ్యక్తులకిమ్మని బోధించాడు.

"అందరికీ సమానంగా వుండేందుకూ, ప్రస్తుతం మీ సంపద వారి అవసరములకూ, వారి సంపద మీ అవసరములకూ సహాయకారిగా వుండాలని ఈ విధంగా చెప్పుచున్నాను." (II కొరింథీయులు-8వ అధ్యాయం - 15)

ఈ విధమైన మానవతా వాద సందేశంద్వారా నాటి సమాజంలోని దీనులను ఆదుకునేందుకు ప్రజలను మేల్కొలిపాడు.

అలాగే నాటి పురోహిత వర్గాన్నీ ఇలా ప్రశ్నించాడుః "దరిద్రులకు అన్యాయం చేయడానికీ, వితంతువులకు పునర్వివాహ హక్కు నిరాకరించడానికీ, మీకు అనుకూలమైన శాసనాలను మీరు చేస్తున్నారు. దేవుడు వీటిని గూర్చి మిమ్ములను అడిగితే మీరేమని జవాబు యిస్తారు? మీకు భవిష్యత్తులో రాబోయే వినాశనాన్ని ఎలా తపించుకోగలరు?" మానవులలో ఒకడు యూదుజాతివాడనీ, వేరొకదు గ్రీకుజాతివాడనీ తేడా చూపకూడదు. స్త్రీ పురుష విచక్షణ గూడా చూపరాదు. అంతా సమానులే." (గెలాషియన్లు - కొత్త నిబంధన - 3వ అధ్యాయం - 28, 29)

ఈ విధంగా నాటి పురోహిత నిరంకుశ పాలక వర్గాన్ని ధైర్యంగా ప్రశ్నించడంతో, సర్వమానవ సౌభ్రాతృత్వ సందేశాన్నివ్వడంతో దేశవ్యాప్తంగా వున్న దీనులు, హీనులు తనను అనుసరించడంతో నాటి రోమన్ సామ్రాజ్య ఏలికలు క్రీస్తును తమ పునాదులు కదిపే విప్లవకారుడిగా గ్రహించి ప్రజలలో రాజుకూ, దైవానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనీ ఆరోపణలు చేసి బంధించి తీవ్రమైన అత్యంత పాశవికమైన శిక్ష శిలువకు సజీవంగా మేకులు కొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి బహిరంగంగా హత్యచేసారు.

నాటి మత, పరిపలనా వికృత రూపాలను ప్రశ్నించినందుకు, ప్రజలలో మానవతను మేల్కొలిపి తద్వారా దీనులను ఆదుకునేందుకు ప్రయత్నించిన జీసస్ ఈ శకపు తొలి పిప్లవకారుడిగా మనం నిరూపించవచ్చు.

( క్రీస్తు మరణానంతరం క్రైస్తవ మిషనరీలు కూడా రాచరికవ్యవస్థకు కొమ్ముకాసిన విధాన్ని తరువాతి భాగంలో రాస్తాను. ఇందులో నేను పేర్కొన్న చారిత్రకాంశాలు 'నరబలి' అన్న సి.వి.గారి పుస్తకంలోనివి)

3 కామెంట్‌లు:

  1. అంతకు ముందటి బుద్దుడిని,
    దానికి ముందటి కృష్ణుడిని మీరు కావాలని మర్చినట్టున్నారు :)

    రిప్లయితొలగించండి
  2. నేనన్నది ఈ శకానికి సంబంధించినంతవరకు. బుద్ధుడు క్రీస్తుకంటే ముందరివాడని గుర్తుంది. ఈ బ్లాగు టైటిల్ దగ్గరనుంచి అంతా బుద్ధిజంపైనే రాద్దామని. కానీ క్రిస్టమన్ సందర్భంగా ముందుగ ఇది రాసాను. మీ ఇద్దరి స్పందనలకు థాంక్స్.

    రిప్లయితొలగించండి