11, డిసెంబర్ 2009, శుక్రవారం

సువర్ణ యౌధేయుడు

ఇది 'మహాపండిత్' అని కాశీ పండితులుతోను. బౌద్ధ విజ్నానులచే 'త్రిపీఠికాచార్య' అనే బిరుదులతో గౌరవింపబడ్డ అంతర్జాతీయ విఖ్యాతిపొందిన పాలీ, సంస్కృత భాషాపండితుడు, గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు పది సం.ల సుదీర్ఘకాలం స్వాతంత్ర్యయోధులుగా కారాగారములో గడిపిన త్యాగమూర్తి, లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడిగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు, హిందూ సన్యాసిగాను, ఆర్యసమాజకునిగాను, అంతర్జాతీయ బౌద్ధభిక్షువుగను ఖ్యాతినొందిన రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ఓల్గా నుండి గంగకు చారిత్రక గ్రంధములోని నాకు నచ్చిన భాగం నుండి గ్రహించిన చారిత్రక ఘట్టం. వీలయినంత తక్కువ వ్యవధిలో మొత్తం భాగాన్ని మీ ముందు వుంచుతాను. నాటి చారిత్రక పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా భారతీయ సాంస్కృతిక మూలాలు అవగతం అవుతాయని నా భావన.

**@@@@**

కాలం: క్రీ.శ. 400

(1)

నా నుదుటిరాత ఎలాంటిదో కదా! ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండలేదు. ప్రపంచంలో నాకు తగిలిన దెబ్బలు నన్ను చంచలుణ్ణి చేశాయి. ఎప్పుడూ కంగారుగానే ఉండేటట్టు చేశాయి. జీవితంలో తియ్యని క్షణాలు ఉన్నాయి. అయితే చేదుఘడియలే ఎక్కువ. బతుకులో మార్పు వర్షం వెలిసిన తర్వాత ఉండే మబ్బుల్లాగ వస్తుంది. కాస్తదూరం వానచినుకులు పడుతూంటాయి. మరికొంచెం దూరానికి ఎండకాస్తూ ఉంటుంది. ఈ మార్పు అన్నది ఎందుకు జరుగుతూ ఉంటుందో తెలేటంలేదు. పశ్చిమాన్ని ఉత్తరాపథపు గాంధారంలో ఇప్పటికీ మధుపర్వంలో (పంచామృతం - అతిథులకిచ్చేది) దూడమాంసాన్ని ఇస్తారు. అలాంటివి మధ్యప్రదేశంలో (యుక్తప్రాంతం-బీహారు) గోమాంసం పేరెత్తడం కూడా మహాపాపం. అక్కడే గోబ్రాహ్మణ సంరక్షుణని పరమధర్మంగా చెప్తారు. ధర్మంలో ఇంతింత తేడాలెందుకో. ఓ చోట ఓలాగా ఓచోట ఓ లాగా ఎందుకున్నాయో నాకు అర్థం కాదు. ఓ దగ్గర అధర్మం మరోదగ్గర ధర్మంగా చలామణీ అవుతూ ఉంటుందా? లేకపోతే ఒకదగ్గర మార్పు ముందర వచ్చిందా? రెండో చోట ఆ మార్పుని తర్వాత అనుసరించి అంగీకరించి ఉంటారా? ఏకకాలంలో అన్నిచోట్లా మార్పు రాకపోవడంనుంచి అలా అవుతుంది.

అవంతి (మాలవా) లోని క్షిస్రానది ఒడ్డున ఉన్న ఓ ఇంట్లో నేను పుట్టాను. నా కులంవాళ్ళు తమనితాము యాత్రికులుగా అనుకునేవారు. వీళ్ళకి అక్కడ భూమీ పుట్రా, ఇల్లూ వాకిల్లూ ఉన్నాయి. వాటిని వాళ్ళు తమభుజానికెత్తుకుని ఎక్కడికీ తీసుకువెళ్ళలేరు కదా? నా కులంవాళ్ళు బాగా ఒడ్డూ పొడవూ ఉండి తెల్లటి తెలుపురంగువాళ్ళు. ఊళ్ళో మిగతావాళ్ళ రూపురేఖలకి వీళ్ళ రూపురేఖలకీ తేడా వుంది. వీళ్ళు పైవాళ్ళ దర్జాని ఏ మాత్రం సహించేవారు కాదు. మా అమ్మ ఊరంతటికీ అందమైనది. ఆవిడ తెల్లటి మొహం, బూడిదరంగు జుట్టూ ఎంతో అందంగా ఉంటాయి. మా కుటుంబంవారు తాము బ్రాహ్మలమని చెప్పుకునేవారు. అయితే ఊళ్ళో వాళ్ళకీ విషయంలో సందేహం ఉన్నట్లుగా అనిపించేది. సందేహించాల్సిన సంగతే. అక్కడ బ్రాహ్మాల్లో మద్యం తాగడం మహాపాపం. కాని మా ఇంట్లో మద్యం అలా తయారవుతూనే వుంటుంది. తాగుతూనే ఉంటారు. ఉన్నతకులాల్లో ఆడా మగా కలిసి నాట్యంచేయడం అన్నమాట ఎక్కడా ఉండదా కాని మా కులంలోని ఏడుకుటుంబాల వాళ్ళు-అన్ని కుటుంబాలూ ఒక్కలాగే పెద్దపెద్ద కుటుంబాలే. సాయంత్రం అయీ అవడం నాట్యం చేయడానికి పోగవుతారు. బాగా చిన్నప్పుడు అన్నిచోట్లా అలాగే నాట్యం చేస్తారని అనుకునేవాణ్ణీ. కానీ మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటూ వాళ్ళు మమ్మల్ని ఓ చిత్రమైన మనుషులుకింద చూస్తున్నారని తెలిసింది. మా కులీనత్వాన్ని అంగీకరించినప్పటికీ వాళ్ళు మేం బ్రాహ్మలమే అని అనుకోవడానికి సందేహించేవారు. మా వూరు చాలా పెద్దది. దుకాణాలు, కోమట్ల ఇళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని నాగర కుటుంబాలున్నాయి. వీళ్ళని కోమట్లని అనేవారు. కానీ వాళ్ళు తమని తాము మాకుమల్లేనే బ్రాహ్మలమని చెప్పుకునేవారు. ఎంతోమంది నాగర కుటుంబాల్లోని అమ్మాయిలని మా కులంవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇదీ ఒక కారణమే. ఊళ్ళోవాళ్ళూ మమ్మల్ని బ్రాహ్మలుగా ఒప్పుకోవడానికి సిద్ధంగాలేరు. బ్రాహ్మల భోజన పద్ధతులు, పెళ్ళిపేరంటాల పద్ధతులు నియమాల్ని కాదని వాటిని తక్కువ చేసినవాళ్ళు బ్రాహ్మలెలా అవుతారని వాళ్ళ ఉద్దేశ్యం. నాతోటి పిల్లలు ఎప్పుడైనా కోపం వస్తే నన్ను "పందెంపుంజు" అని వెక్కిరిస్తారు. నేను మా అమ్మని ఎన్నోసార్లు అడిగాను. కానీ ఆవిడ ఏం చెప్పకుండా మాట మరిపించేస్తోంది.

నాకిప్పుడు జ్నానం పెరిగింది. పదేళ్ళవాణ్ణి. ఊళ్ళో ఓ బ్రాహ్మణ గురువుగారి పాఠశాలలో చదువుకోడానికి వెళ్తున్నాను. నాతోటి విద్యార్థులు చాలావరకు అంతమందీ బ్రాహ్మలే. అంతమందీ అసలు సిసలైన బ్రాహ్మలు! నేనూ నాతోపాటు ఓ ఇద్దరు నాగర విధార్థులం ఉన్నాం - మమ్మల్ని మా తోటి విద్యార్థులు నకిలీ బ్రాహ్మలు అనేవారు. వాళ్ళు మరి పక్కా బ్రాహ్మలు! మా గురువు గారికి నేనంటే చాలా ఇష్టం. చాలా తెలివిగా చురుగ్గా ఉంటానని ఆయన నన్ను ఎక్కువ అభిమానించేవారు. మాకులం స్వభావం నాలోనూ వుంది. ఎవరిమాటా పడేవాణ్ణి కాదు. దెబ్బలాడేవాణ్ణి. ఆవేళ నా తోటివిద్యార్థి వ్యంగ్యంగా ఓ విసురుమాట అన్నాడు - "మహా పెద్ద బ్రాహ్మడొచ్చాడయ్యా! పందెంపుంజుంగాడు!" మా పిన తండ్రి బావమరిది కొడుకు నా పక్షాన్ని దెబ్బలాడపోయేడు. దాంతో వాణ్ణి ఆ విద్యార్థి తిట్టాడు- "గ్రీకుగాడాని! నాగరబ్రాహ్మాట్ట నాగరబ్రాహ్మడు!" చిన్నప్పట్నించి చిన్నపిల్లల దగ్గర్నుంచి ఇలా వ్యంగ్యంగా విసురుమాటలు అంటూవుండడం వింటూనేఉన్నాను. కానీ అప్పుడు అవి అంత బాధపెట్టేవి కావు. వాటి అర్థమూ అంతగా తెలిసేది కాదు. పాఠశాలలో మేం ముగ్గురంకాక ముప్పైమంది విద్యార్థులున్నారు. నలుగురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళూ మాలాగే తెల్లటి వాళ్ళు. ఒడ్డూ పొడుక్కైతే మా అంత పొడుగైనవాళ్ళు కారు. అయినప్పటికీ మాకు వాళ్ళముందు తలవంచాల్సి వచ్చేది.

ఆ వేళ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నేను మొహం వేలేసుకుని వెళ్ళాను. మా అమ్మ వాడిపోయిన నా మొహాన్ని చూసి నన్ను ముద్దుపెట్టుకుంది.

"ఏం బాబూ అలా వున్నావేం?" అంది.
ముందు నేను మాట మార్చేద్దామనుకున్నాను. కానీ అమ్మ ఎంతో బలవంతం చేసి చెప్పమని అడిగింది.

"అమ్మా మనకులం గురించి ఏదోగాని ఉంది. దాన్నించే మనల్ని బ్రాహ్మలని ఎవరూ ఒప్పుకోవటంలేదు."

"మన పరదేశ బ్రాహ్మలం బాబూ! అందుకని వాళ్ళు అలా అనుకుంటారు."

"బ్రాహ్మల్లే కాదమ్మా! బ్రాహ్మలు కాని వాళ్ళు అలాగే అనుకుంటారు. మనం బ్రాహ్మలమా అని సందేహంగా చూస్తారు."

"ఈ బ్రాహ్మలు చెప్పడం నుంచి వాళ్ళలాగ అనుకుంటారు."

"మనచేత యజ్నాలు చేయించేవాళ్ళే లేరు. మిగతా బ్రాహ్మలు పౌరోహిత్యం చేస్తారు. బ్రాహ్మణ భోజనాలకి వెళ్తారు. మనకులంలో అదేం లేదు. పైగా బ్రాహ్మలు వాళ్ళ పంక్తిలో మనకి భోజనంకూడా పెట్టరు. అమ్మా, నీకు తెలిస్తే విషయం ఏమిటో చెప్పు."

అమ్మ ఎంతో బోధపర్చింది. అయినా నాకు సంతోషం కలగలేదు.

నా మనస్సిలా చికాకు పడిపోయినప్పుడు. కంగారుకంగారుగా ఉన్నప్పుడూ నా తోటి నాగర విద్యార్థులూ, మిగిలిన చుట్టాలూ సానుభూతిని చూపెట్టేవారు. ఇంకో మాటలో చెప్పాలంటే మేమ్ ఒకరిపట్ల ఒకరం సానుభూతి చూపెట్టుకునేవాళ్ళం.

(మిగతా భాగం తరువాత)

2 కామెంట్‌లు:

  1. కూడు పెట్టని కులాలు...ఎందుకీ రాక్షస ప్రవృత్తి మనుషుల్లో పుట్టిందో


    తరువాతి టపా త్వరగా రాసేయండి అప్పుడు మొత్తం మీద నా అబిప్రాయం చెప్తాను

    www.tholiadugu.blogspot.com

    రిప్లయితొలగించండి